సిటీస్‌ లో రియాల్టీ డమాల్..పట్నం వద్దు పల్లే ముద్దంటున్న సర్వేలు…!

-

పట్నంలో సొంతిల్లు ఉందంటే ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్లు. కానీ కరోనా వచ్చాక… పరిస్థితి తారుమారైంది. ఉన్నదంతా అమ్ముకుని పల్లె, చిన్నచిన్న పట్టణాలకు వెళ్లిపోదామనుకున్నవాళ్లు ఇటీవల ఎక్కువవుతున్నారు. ప్రపంచాన్నే తలకిందులు చేసింది కరోనా మహమ్మారి. క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అనే మాటలు పోయి.. కరోనా ముందు కరోనా తర్వాత అనే పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు పనుల కోసం పల్లె వదిలి.. పట్నం వచ్చే వాళ్లు. కానీ కరోనా దెబ్బకు.. అదే జనాలు ఇప్పుడు పట్నం వదిలి, పల్లెబాట పడుతున్నారు.

సిటీలో చిన్నాచితకా ఉద్యోగం చేసుకునే సామాన్యుడికి సైతం సొంతింటి కల తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సిటీలోనే చిన్న ఇల్లైనా కట్టుకుని సెటిల్ అయిపోదామని అనుకుంటారు. ఇలా కలను నిజం చేసుకున్నవాళ్లెందరో. సొంతూర్లో ఆస్తులు పొలాలు అమ్మి మరీ సిటీలో ఇళ్లు కట్టుకున్న వాళ్లున్నారు. ఎన్ని గజాలన్నది ముఖ్యం కాదు.. సిటీలో ఇల్లుందా లేదా అనేదే హూందా తనంగా కూడా మారింది. కానీ… ఇవన్నీ కరోనాకు ముందు పరిస్థితి. తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. జనాలు పట్నం అంటేనే ఠారెత్తిపోతున్నారు.

కరోనాతో పరిస్థితులు తారుమారై , పట్నం వదిలి పల్లె బాట పడుతున్నారు మెజార్టీ జనం. ఈ గడ్డుకాలంలో నగరంలో ఉండేకంటే .. సొంతూర్లో గంజి నీళ్లు తాగైనా ప్రాణాలతో ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇలా.. సిటీ వదిలి సొంతూరికి తరలి వెళ్లిన వారు లక్షల్లోనే ఉన్నారు. ఇదే తరహాలో… ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు డిమాండ్‌ పెరిగింది. అద్దె ఇళ్ల కోసమే కాదు. సొంతంగా ఇళ్లు కొనాలన్నా ఇలాంటి సిటీలవైపే మొగ్గు చూపుతున్నారు జనాలు.

కరోనా సంక్షోభం తర్వాత టూ టైర్, త్రీ టైర్ సిటీలకు డిమాండ్‌ పెరిగిందని సర్వేలు కూడా చెబుతున్నాయి. గతంతో పోలిస్తే చిన్న పట్టణాలకు డిమాండ్‌ 30 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. డిమాండ్‌ పెరిగిన నగరాల్లో విజయవాడ, అమృత్‌సర్‌, చండీగఢ్‌, వడోదరా, నాగ్‌పూర్‌, కోయంబత్తూరు ఉన్నాయి. ఆన్‌లైన్‌ సెర్చ్‌లో… చిన్న నగరాల్లో ఇళ్ల కోసం వెతుకుతున్న వారి వాటా ఈ ఏడాది ఫస్ట్‌ క్వార్టర్‌కి 27 శాతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. గతేడాది ఇదే కాలానికి కేవలం 18 శాతం మాత్రమే ఉంది.

కరోనా సంక్షోభంతో దేశీయ స్థిరాస్తి రంగం కుప్పకూలింది. ఈ ఏడాదిలో గడిచిన 9 నెలల్లో అంటే… జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో.. హైదరాబాద్‌ సహా 7 అతిపెద్ద నగరాల్లో, ఇళ్ల విక్రయాలు 57 శాతం క్షీణించి 87వేల 460 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news