ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య ప్రస్తుతం 1 లక్షకు పైగా ఉండగా, 3వేల మంది ఆ వైరస్ వల్ల చనిపోయారు. ఇక భారత్‌లో కరోనా వైరస్ ఉన్న వారి సంఖ్య సోమవారంతో 43కు చేరుకుంది. అయితే కరోనా వైరస్ టెస్ట్‌కు భారత్‌లో 1 రోజు వరకు సమయం పడుతుండగా, చైనాలో మాత్రం కేవలం 15 నిమిషాల్లోనే ఆ టెస్టును పూర్తి చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ టెస్టుకు చైనా వాడుతున్న టెక్నాలజీ పట్ల కేవలం భారత్ మాత్రమే కాదు, యూకే, యూఎస్ఏ సైంటిస్టులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో కరోనా వైరస్‌ను నిర్దారించేందుకు టెస్టుల కోసం రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్-పాలీమరేజ్ చెయిన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) అనే పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇక చైనాలో హోం ప్రెగ్నెన్సీ కిట్‌ను పోలిన డివైస్‌తో చేతి వేళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి కరోనా వైరస్ టెస్ట్ చేస్తున్నారు. అయితే కేవలం చైనా మాత్రమే కాదు, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్ తదితర దేశాలు కూడా చైనా తరహా పద్ధతిలోనే కరోనా టెస్టులు చేస్తున్నాయి. కానీ అమెరికా, యూకేలలో భారత్ తరహాలో టెస్టులు చేస్తున్నారు. దీంతో అక్కడ కూడా కరోనా వైరస్ నిర్దారణ టెస్టులకు 24 నుంచి 48 గంటల వరకు సమయం పడుతోంది.
అయితే కరోనా వైరస్ టెస్ట్‌ల కోసం చైనా తరహాలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు, టెస్టు రిజల్ట్ సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించేందుకు యూకేలోని సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఆ ప్రయోగాలు ఎప్పటి వరకు సఫలం అవుతాయో వేచి చూస్తే తెలుస్తుంది..!