ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికీ మాస్కులను చాలా మంది ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా వైరస్ మరిన్ని మార్పులకు లోనవుతుందని.. అదే జరిగితే ఇప్పుడు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్లు ఏవీ దానికి పనిచేయవని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
మలేషియాలో ఇండియా, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన వారిలో ఉన్న కరోనా వైరస్ పలు మార్పులకు లోనైందని అక్కడి సైంటిస్టులు గుర్తించారు. మొత్తం 45 కేసుల్లో 3 మందిలో కరోనా వైరస్ మార్పులను వారు గుర్తించారు. ఇక ఇటీవలే ఒడిశాలోనూ 1536 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో కరోనా వైరస్ 73 రకాలుగా మారిందని గుర్తించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడం వల్లే అనేక పరివర్తనాలకు లోనవుతుందని, ఇదే గనక కొనసాగితే.. వైరస్ 10 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందేలా మారుతుందని.. తరువాత కేసుల సంఖ్య భీభత్సంగా పెరిగిపోతుందని సైంటిస్టులు అంటున్నారు.
ఇక కరోనా వైరస్ మార్పులకు లోనవుతుంది కనుక వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ఇవ్వాలని సైంటిస్టులు అంటున్నారు. ఆలస్యం అయితే అప్పటి వరకు కరోనా వైరస్ ఇంకా మార్పులకు లోనైతే ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఏవీ దాన్ని అడ్డుకునేందుకు పనిచేయవని వారు హెచ్చరిస్తున్నారు. కనుక వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్లను ఇవ్వాలని అంటున్నారు.