దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా దేశంలో కరోనా రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం కొత్తగా 3,52,991 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరగా.. ప్రస్తుతం 28,13,658 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 1,92,123 మంది కరోనాను బలయ్యారు.
అయితే మే నెలలో కరోనా మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో మే నెల మధ్య నాటికి రోజువారీ కేసుల సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. మే 23 నాటికి రోజుకు 4,500 మంది మరణించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఇవాల్యువేషన్ (ఐహెచ్‌ఎంఈ) మే ప్రారంభంలోనే అధికారిక, అనధికారిక గణాంకాలు కలిపి రోజుకు 10 లక్షలపైనే కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. ఆగస్టు ప్రారంభం నాటికి ఇండియాలో 6.64 లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఈ నివేదికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆంక్షలు కఠినతరం చేసి కరోనాను కట్టడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలానే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరింత వేగంగా జరపాలని సూచిస్తున్నారు. లేకుంటే దేశంలో కరోనా విలయతాండవం తప్పదని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థ అవసరమని అంటున్నారు.