ఐపీఎల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఐదు రోజుల్లో తొలి మ్యాచ్. ప్రారంభానికి సర్వం సిద్ధమైన వేళ ఈసారి కూడా ఐపీఎల్ పై కరోనా పడగ పడింది. అసలు ఐపీఎల్ జరుగుతుందా, లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో కరోనా కేసులు తగ్గడంతో.. ఇక ధనాధన్ క్రికెట్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చని అభిమానులు భావించారు. అయితే ఫిబ్రవరి నుంచి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మార్చి చివరి నాటికి ఉధృతి పెరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో.. ఐపీఎల్ నిర్వాహకుల్లో అలజడి రేపుతోంది. సీజన్ ప్రారంభానికి ముందే వైరస్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. అక్షర్ పటేల్.. ముంబైలో తను బసచేసిన హోటల్‌లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్షర్ ఇంకా బయో బబుల్‌లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది.
ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్‌లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు రావడంలేదు. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఆటగాళ్లకు, సిబ్బందికి వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో టోర్నీ జరుగుతుందా, లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు అంతకంతకూ పెరుగుతుండటం.. క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. శనివారంనాడు వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ తొలిపోరులో తలపడనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, రాజస్థాన్ సైతం ఇప్పుడు ముంబయిలోనే ఉన్నాయి.