ప్రభుత్వ వ్యతిరేక నినాదాలే మంగళవాయిద్యాలు.. ఫ్లకార్డులే కట్నకానుకలు!

-

‘పెండ్లంటే పందిళ్లు సందళ్లు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్లు ఏడే అడుగులు మొత్తం కలిపీ నూరేళ్లూ’ అంటూ సాగే ఓ పాత సినిమా పాట కొత్తగా ఒక్కటి కాబోయే జంటకు మధురానుభూతులను కలుగజేస్తుంది. కానీ సోమవారం తమిళనాడులో జరిగిన ఓ పెండ్లిలో మాత్రం ఈ పాటలో చెప్పినట్లుగా పందిళ్లూ లేవు, తప్పెట్లు తాళాలూ లేవు. ప్రభుత్వవ్యతిరేక నినాదాలే మంగళవాయిద్యాలుగా, నిరసనకారుల చేతుల్లోని ఫ్లకార్డులు కట్నకానుకలుగా ఆ పెండ్లి జరిగింది.

అసలేం జరిగిందంటే.. తమిళనాడు రాష్ట్రం, చెన్నై నగరానికి చెందిన షెహెన్‌షా, సుమైయాలకు కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. గత శుక్రవారమే వారికి వివాహం జరుగాల్సి ఉండే. కానీ అప్పటికే వారు నివాసం ఉంటున్న ఓల్డ్‌ వాషర్‌మ్యాన్‌పేట బస్తీలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకు) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటంతో వారి పెండ్లి వాయిదాపడుతూ వస్తున్నది.

అయినా ఆందోళన కార్యక్రమాలు ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని సోమవారం సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుల మధ్యే షెహెన్‌షా, సుమైయాల పెండ్లి జరిపించారు. ఆందోళనలో పాల్గొంటున్న వందల మంది నిరసనకారులు ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version