రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు సహజంగానే కొందరికి దురదృష్టకరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా రైలు సిబ్బంది ప్రయాణికుల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తిస్తుంటారు. దీంతో కొందరు చూసీ చూడనట్లు వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం అలాంటి రైల్వే సిబ్బందిపై న్యాయ పోరాటం చేస్తారు. చివరికి విజయం సాధిస్తారు. అవును.. ఓ వృద్ధ జంట అలాగే చేసింది.
కర్ణాటకలోని బెల్గామ్ ప్రాంతం సోలాపూర్‌కు చెందిన ఓ వృద్ధ జంట 2010లో సోలాపూర్ నుంచి ఓ ట్రైన్‌లో ప్రయాణించేందుకు థర్డ్ ఏసీ టిక్కెట్లు కొన్నారు. అయితే వారిలో ఒకరికి అంగ వైకల్యం ఉంది. దీంతో ఒక్క టిక్కెట్‌ను ఆ కోటా కింద వారు రిజర్వ్ చేసుకున్నారు. అయితే రైలులో లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నప్పటికీ, టీటీఈని పలు మార్లు అడిగినా పట్టించుకోలేదు. పైగా వారి గమ్యస్థానం రాక ముందే.. 100 కిలోమీటర్ల ముందుగానే వారిని దించేశారు.
ఈ క్రమంలో ఆ వృద్ధ దంపతులు తమ కుమారుడి సహాయంతో కోర్టులో కేసు వేశారు. అలా 11 ఏళ్ల పాటు ఆ కేసు విచారణ కొనసాగింది. దీంతో తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వృద్ధ జంట పట్ల అలా ప్రవర్తించినందుకు కోర్టు రైల్వేకు జరిమానా విధించింది. వారికి రూ.3 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, అలాగే ఖర్చుల కింద మరో రూ.2500 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా వారు తమకు జరిగిన అవమానం, అన్యాయంపై కోర్టుకెక్కి రైల్వే శాఖపై విజయం సాధించారు.