కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (02-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,764కు చేరుకుంది. ఒక్క రోజే 67 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1474కు చేరుకుంది. 74,404 మంది చికిత్స పొందుతున్నారు. 82,886 మంది కోలుకున్నారు.
2. కరోనా చికిత్స అంత ఖరీదైందేమీ కాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆక్సిజన్, మందులు అన్నీ కలిపినా రూ.10వేలు మించదని తెలిపారు. రోజుకు రూ.1 లక్ష, రూ.2 లక్షలు అయ్యే చికిత్స లేదన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
3. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టు చేయించుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్పంగా జ్వరం తప్ప ఆయనకు ఇతర ఏ లక్షణాలు లేవు. అయితే ఆయన తాను బాగానే ఉన్నానని, ఆందోళన పడాల్సిన పనిలేదని తెలిపారు.
4. పలు రాష్ట్రాల్లో హాస్పిటళ్లలో కోవిడ్ పేషెంట్లను స్మార్ట్‌ఫోన్లను వాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా వారిని స్మార్ట్‌ఫోన్లు లేదా ట్యాబ్లెట్ పీసీలను వాడుకునేందుకు అనుమతివ్వాలని ఆదేశాలిచ్చింది.
5. ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల్లో సోషల్ డిస్టన్స్ నిబంధన పెట్టకపోయి ఉంటే ఇప్పటికి మరో 15 లక్షల కరోనా కేసులు అదనంగా ఉండేవని సైంటిస్టులు తెలిపారు. సోషల్ డిస్టన్స్ వల్ల కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, అయినప్పటికీ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అందుకు టెస్టులను ఎక్కువగా చేస్తుండడమే కారణమని అన్నారు.
6. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,736 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,50,724కు చేరుకుంది. ఒక్క రోజులోనే 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 37,364కు చేరుకుంది. 11,45,630 మంది కోలుకున్నారు. 5,67,730 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
7. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,677కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 18,547 ఉన్నాయి. మొత్తం 47,590 మంది కోలుకున్నారు.
8. కరోనా నేపథ్యంలో బీసీసీఐ దుబాయ్‌లో నిర్వహించ తలపెట్టిన ఐపీఎల్ 2020 టోర్నీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో టోర్నీ దుబాయ్‌లో సెప్టెంబర్ 19న ప్రారంభమవుతుంది. నవంబర్ 10న ముగుస్తుంది. వచ్చే వారంలో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.
9. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,509 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య అక్కడ 4,41,228కు చేరుకుంది. ఇప్పటి వరకు 2,76,809 మంది కోలుకున్నారు. మరో 1,48,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 15,576 మంది చనిపోయారు.
10. లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. బ్రెజిల్‌లో 93,563 మంది చనిపోగా, మెక్సికోలో 47,472 మంది, పెరూలో 19,021 మంది, కొలంబియాలో 10,330 మంది, చిలీలో 9,533 మంది, అర్జెంటీనాలో 3,596 మంది ఇప్పటి వరకు చనిపోయారు.