కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (06-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మంగళవారం రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె సమావేశం కానున్నారు. కోవిడ్ చికిత్స ఇస్తున్న హాస్పిటళ్ల ప్రతినిధులతో ఆమె సమావేశమవుతారు. ఈ క్రమంలో కోవిడ్ పరీక్షలు, పడకలు, బిల్లులు, ప్రజల సమస్యలపై ఆమె హాస్పిటల్స్ ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
2. కరోనా మహమ్మారికి కొబ్బరినూనె చెక్ పెడుతుందా.. లేదా.. అనే అంశాన్ని ప్రస్తుతం సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అలాగే లారిక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల ఈ నూనె కరోనా క్రిములను నాశనం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వారు అధ్యయనాలు చేస్తున్నారు.
3. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని పలువురు సైంటిస్టులు నిర్దారించారు. కోవిడ్ పేషెంట్లు ఉండే ప్రదేశంలో గాలిలోని కణాలు ఆ వైరస్‌ను కలిగి ఉంటాయని.. ఆ ప్రదేశంలోకి ఇతరులు వెళ్లినప్పుడు వారు ఆ కణాలను పీల్చుకుంటే.. వారికి కూడా కరోనా వస్తుందని సైంటిస్టులు తేల్చారు. ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేయాలని వారు ఆ సంస్థను కోరారు.
4. భారత్‌లో సోమవారం వరకు మొత్తం 1 కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించారని ఐసీఎంఆర్ తెలిపింది. మొత్తం టెస్టుల సంఖ్య 1,00,04,101కు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే 1,08,596 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 24,248 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయిందని ఐసీఎంఆర్ తెలిపింది.
5. కరోనా మహమ్మారికి గాను రెమ్‌డెసివిర్‌కు జనరిక్ వెర్షన్ ఔషధాన్ని తయారు చేస్తున్నట్లు దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ తెలిపింది. సదరు మెడిసిన్‌ను డెస్రెం పేరిట అందుబాటులోకి తేనున్నారు. దాని ధర 100 మిల్లీగ్రాముల డోస్‌కు రూ.4,800 ఉండనుంది. ఈ మెడిసిన్‌ను ఈ నెలాఖరు వరకు అందుబాటులోకి తేనున్నారు.
6. కరోనా పాజిటివ్ అని తేలిన ఓ జర్నలిస్టు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని ఓ ప్రముఖ పత్రికలో విధులు నిర్వహిస్తున్న తరుణ్ సిసోడియాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికి ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. అతని జాబ్ పోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురైన అతను ఆస్పత్రి భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
7. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఆ రాష్ట్రంలో మొత్తం 1,00,823 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 1379 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,115 మంది చనిపోయారు.
8. కర్ణాటకలోకి మాండ్య ఎంపీ, సినీనటి సుమలతకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. గొంతు నొప్పి ఉందని ఆమె హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా అని తేలింది. ఈ క్రమంలో ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
9. ఏపీలో కరోనా కొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజే కొత్తగా 1322 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరుకుంది. మొత్తం 239 మంది చనిపోయారు. 8,920 మంది కోలుకోగా.. 10,860 మంది చికిత్స పొందుతున్నారు.
10. గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ హాస్పిటల్‌ను కేవలం కోవిడ్ 19 పేషెంట్ల కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు.