కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో గురువారం (02-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. హైదరాబాద్ నగరంలోని పలు ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 5వ తేదీ వరకు శాంపిల్స్ సేకరణను నిలిపివేస్తు్న్నట్లు ల్యాబ్‌లు వెల్లడించాయి. తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
2. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641 కి చేరుకుంది. మొత్తం 17,834 మంది చనిపోయారు. 3,59,860 మంది కోలుకున్నారు. 2,26,947 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.
3. కరోనాతో బాధపడుతున్న వారి కన్నా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిత్యం సగటున 10వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకుంటున్నారు.
4. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో మొత్తం 4343 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,392కి పెరిగింది. మొత్తం 1321 మంది చనిపోయారు.
5. కరోనా వైరస్‌కు గాను మరో కొత్త వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చింది. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే కంపెనీలు సంయుక్తంగా కలిసి బీఎన్‌టీ162బి1 పేరిట ఓ వ్యాక్సిన్‌ను రూపొందించాయి. ఈ వ్యాక్సిన్ తొలి దశ హ్యూమన్ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో రెండో దశ ట్రయల్స్‌ను త్వరలో పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు.
6. మనలో చాలా మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అవసరం లేదని.. వైరస్ దానంతట అదే సహజంగా సమసిపోతుందని.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎపిడెమియాలజిస్టు సునేత్ర గుప్తా అన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్నారు. మిగిలిన వారికి కరోనా సోకినా దాన్ని సాధారణ ఫ్లూగానే పరిగణించాలన్నారు.
7. దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో కరోనా అత్యవసర రోగుల కోసం ప్లాస్మా బ్యాంక్‌ను ఢిల్లీ సర్కారు ప్రారంభించింది. కరోనా నుంచి కోలుకున్న 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న, 50 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉన్న, ఆరోగ్యవంతమైన వ్యక్తులు ప్లాస్మా దానం చేయవచ్చు.
8. కరోనా సోకిన పురుషుల్లో వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతుందని రష్యాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు వారు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు. కరోనా వల్ల పురుషులకు ఇన్‌ఫెర్టిలిటీ సమస్య వస్తుందంటున్నారు.
9. కోవిడ్ 19 బారిన పడ్డ వారు, 65 సంవత్సరాలకు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1961 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఈ సౌకర్యానికి అనుమతులు ఇచ్చారు.
10. చాలా తక్కువ, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఆక్స్‌ఫర్డ్ వారు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని సైంటిస్టులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ రెండో దశలో ఉంది. అతి త్వరలోనే ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.