సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ బిగ్బాస్ రియాలిటీ షోతో పాటు హైదరాబాద్లో జరగనున్న అందాల పోటీలపై తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు భారతీయ సంస్కృతిని అవమానపర్చే విధంగా ఉన్నాయన్నారు. బిగ్బాస్ కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శించిన నారాయణ, ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, కళారంగానికి అపకీర్తిని తీసుకురుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. “చీప్ వ్యభిచారం వద్దు, ఖరీదైన వ్యభిచారం చేయండి అన్నట్టుగా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తున్నట్టు ఉంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వివాహేతర వ్యక్తులు ఒకే మంచం మీద పడుకోవడం వంటి అనుచిత దృశ్యాలను ప్రసారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బిగ్బాస్ షోను నిషేధించాలనే దిశగా గత కొంతకాలంగా తాను న్యాయపోరాటం చేస్తోన్న విషయాన్ని వెల్లడించారు. పోలీసు శాఖ నుంచి జిల్లా కోర్టు వరకు తన ప్రయత్నాలు విఫలమైనా, హైకోర్టు స్పందించి షో నిర్వాహకులకు, వ్యాఖ్యాత నాగార్జునకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అలాగే, హైదరాబాద్లో జరగనున్న అందాల పోటీలను కూడా ఆయన తీవ్రమైన విమర్శల పాలయ్యాయి. మహిళలను వస్తువుల్లా ప్రదర్శించే ఈ పోటీలు సాంఘికంగా దారుణమని నారాయణ అభిప్రాయపడ్డారు. పర్యాటక అభివృద్ధి పేరుతో ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం అవమానకరమని వ్యాఖ్యానించారు.
“భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న సమయంలో, బిగ్బాస్ వంటి కార్యక్రమాలు మన విలువలను నాశనం చేస్తున్నాయి” అని నారాయణ హితవు పలికారు. సమాజం మేలుకోని, ఇటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.