తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో పోరాట బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించగా, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయంలో ఉద్యోగ సంఘాలు సమరం అంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్ర జనాభాలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిపి 2 శాతమే ఉంటారు. మరి మిగతా 98 శాతం ప్రజలపై మీ యుద్ధమా?” అంటూ సీఎం ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు నష్టం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఉద్యోగ సంఘాల సమస్యలు ఉంటే వాటిని చర్చ ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలన్న కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారకూడదని హెచ్చరించారు. గత పదేళ్లలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని సీఎం విమర్శించారు. “మేము 16 నెలల్లో తెచ్చిన రూ. 1.58 లక్షల కోట్ల లోన్లలో నుంచి, గత ప్రభుత్వ అప్పులకు వడ్డీ సహా రూ. 1.52 లక్షల కోట్లు చెల్లించాం. నెలకు రూ. 7 వేల కోట్ల మేర వడ్డీ-అసలు చెల్లిస్తున్నాం. రాష్ట్ర ఆదాయం నెలకు రూ. 18,500 కోట్లు మాత్రమే. ఈ పరిస్థితుల్లో బోనస్‌లు, జీతాల పెంపులు ఎలా చేయాలో మీరే చెప్పండి” అన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజల పక్షాన ఉండాలని, రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకూడదని సూచించారు. “మీకు ఉద్యోగం ఇచ్చింది ప్రజలే. మేము కూడా వారి సేవకులమే. చర్చలకు రండి, పరిష్కార మార్గం కనుగొందాం” అని పిలుపునిచ్చారు.