కేబీఆర్ పార్క్ లో మహిళకు రక్షణ కరువైంది. గతంలో సినీ నటి చౌరాసియాపై ఇలాగే లైంగిక దాడి జరిగింది. తాజాగా మరోసారి ఓ మహిళపై ఆగంతకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.
హైదరాబాద్ బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ లో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గుర్తు తెలియని దుండగులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా శనివారం ఉదయం పూట భర్తతో వాకింగ్ వెళ్లిన ఓ మహిళకు ఇలాంటి ఘటనే ఎదురైంది. వాక్ వేలో నడుస్తున్న సమయంలో ఓ దుండగుడు సదరు మహిళను వెంబడించాడు. కొంత దూరం వెళ్లాక మహిళను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ కేకలు వేయడంతో భర్త అక్కడకు వచ్చాడు. దుండగుడు పారిపోయాడు. ఈ ఘటనపై భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
గతంలో కూడా ఇలాగే నటి షాలు చౌరాసియా పై ఓ ఆగంతకుడు లైంగిక దాడికి యత్నించాడు. నిర్మానుష్య ప్రాంతంలో పట్టుకుని లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తి నుంచి చౌరాసియా తప్పించుకుంది.