మైనర్​పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142 ఏళ్ల శిక్ష

మైనర్ పై అత్యాచారం కేసులో కేరళలోని ఓ స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారం చేసిన 41 ఏళ్ల వ్యక్తికి 142 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పతనంతిట్ట అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు(ప్రిన్సిపల్ పోక్సో) జడ్జి జయకుమార్ జాన్ ఈ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడు ఆనందన్ పీఆర్​కు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించారు.

జిల్లాలో ఓ పోక్సో కేసులో విధించిన రికార్డు స్థాయి శిక్ష ఇదేనని పోలీసులు తెలిపారు. కోర్టు 142 ఏళ్లు శిక్ష విధించినా.. నిందితుడు మరో 60 ఏళ్లు జైలులో ఉంటాడని ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలు వయసు పదేళ్లు అని పోలీసులు తెలిపారు. నిందితుడు ఆమెకు బంధువేనని చెప్పారు.

నిందితుడు బాలిక కుటుంబంతో ఉండేవాడు. ఈ సమయంలోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 2019 నుంచి 2021 వరకు బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవాడని కోర్టు నిర్ధరించింది. ఈమేరకు పోక్సో, ఐపీసీ 506 సెక్షన్ ప్రకారం నమోదైన కేసులపై అతడికి శిక్ష విధించింది. రూ.5లక్షల జరిమానా చెల్లించకపోతే.. మరో మూడేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.