ముంబైలోని అంధేరికి చెందిన ఓ ప్రైవేటే బ్యాంక్ మహిళా ఉద్యోగిపై అక్కడి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 73 ఏళ్ల ఓ వ్యక్తిని ఆమె రూ.1.30 కోట్లకు మోసం చేసింది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.
ముంబైలోని మలద్ ప్రాంతం మల్వానికి చెందిన 73 ఏళ్ల జెరోన్ జాన్ డిసౌజాకు 2010లో శాంటాక్రజ్ ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న కొంత స్థలం అమ్మడంతో అప్పట్లో రూ.2 కోట్లు వచ్చాయి. దీంతో అతను కొన్ని బ్యాంకుల్లో సమాన మొత్తాల్లో రూ.2 కోట్లను విభజించి ఫిక్స్‌డ్ డిపాజిట్లు నమోదు చేశాడు. అయితే ఇటీవల తాను ఓ ప్రైవేటు బ్యాంకులో వేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు గాను లభించిన వడ్డీని తీసుకునేందుకు బ్యాంక్‌కు వచ్చాడు. అక్కడ షాలిని సింగ్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె అదే బ్యాంకులో ఉద్యోగినిగా పనిచేస్తోంది.
అయితే జాన్ అంతటి భారీ మొత్తాన్ని ఎఫ్‌డీపై వడ్డీగా పొందడం చూసిన షాలిని అతనితో పరిచయం ఏర్పరుచుకుంది. ఇద్దరూ కలిసి పలుమార్లు రెస్టారెంట్లలో డిన్నర్లు కూడా చేశారు. బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే షాలిని జాన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అలాగే తనకు రూ.1.30 కోట్లు ఇస్తే ఓ బిజినెస్‌లో పెట్టుబడిగా పెడతానని, దీంతో ఇద్దరం అందులో లాభాలను పొందవచ్చని ఆమె నమ్మబలికింది. అది నిజమే అని నమ్మిన జాన్ అంత మొత్తాన్ని ఆమె బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తరువాత ఆమె పత్తా లేకుండా పోయింది. అతన్ని కలవలేదు. అతను ఫోన్ కాల్స్ చేసినా ఆమె స్పందించడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన జాన్ అంధేరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.