అనంతపురంలో గంజాయి విక్రయించే పదిమంది ముఠాని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి నాలుగు కేజీలకు పైగా గంజాయి, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.
గంజాయి, తదితర మాదకద్రవ్యాలకు బానిసలు అయిన కొంతమంది యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని.. క్షణకాలం ఆనందం కోసం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దని సూచించారు. అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న పదిమంది ముఠాలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
బుక్కరాయ సముద్రం ఎస్సై కరుణాకర్, ఇన్చార్జి సీఐ హేమంత్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి లకు వచ్చిన పక్కా సమాచారంతో ఈ ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి సేవించినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఈ ముఠా సరఫరా చేస్తున్న గంజాయితోపాటు సేవించేందుకు ఖాళీ ఓసీలు, మౌత్ ప్రెషనర్స్ మరియు కళ్ళు ఎర్రబడకుండా ఉండేందుకు ఐ డ్రాప్స్ ని వాడుతున్నారని.. వాటిని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.