ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆన్‌లైన్ మోసాల బారిన పడుతుంటారు. చదువుకోని వారు ఈ విధంగా మోసానికి గురయ్యారు అంటే అది వేరే. కానీ ఏకంగా ఐఏఎస్ చదివి కూడా ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారు. తాజాగా భోపాల్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి సైబర్ మోసం బారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే..
భోపాల్‌కు చెందిన ఐఏఎస్ అధికారి లోకేష్ జంగిద్ ఆన్‌లైన్‌లో పలు మద్యం బ్రాండ్ల కోసం వెదికాడు. వాటి రేట్ల గురించి తెలుసుకోవాలని తన ఫోన్ నంబర్‌ను ఓ వెబ్‌సైట్‌లో ఇచ్చాడు. అయితే జూలై 11వ తేదీన ఆయనకు ఓ కాల్ వచ్చింది. మీరు అడిగిన మద్యం బ్రాండ్ మా దగ్గర ఉంది.. కానీ ముందుగా మీరు యూపీఐ ద్వారా డబ్బు పంపాలి, అప్పుడే మద్యం డెలివరీ చేస్తాం.. అంటూ చెప్పారు.
దీంతో నిజమే అని నమ్మిన లోకేష్ వెంటనే యూపీఐ ద్వారా రూ.8,850 ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే అవతలి వ్యక్తి తనకు ఆ మొత్తం రాలేదని చెప్పాడు. దీంతో పలు దఫాల్లో లోకేష్ అతనికి మొత్తం రూ.34వేలను పంపాడు. కానీ ఎంత సేపు ఆ వ్యక్తి తనకు డబ్బు అందలేదని చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి మోసం చేస్తున్నాడని గ్రహించిన లోకేష్ వెంటనే భోపాల్ సైబర్ సెల్ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అయితే డబ్బు మాత్రం రికవరీ అవలేదు.