జమ్ములో జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి పని మనిషే డీజీని గొంతు కోసి, హత్య చేసి ఉంటాడని.. సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించాడని వివరించారు. అనుమానితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపట్టామని జమ్ము జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ముకేశ్ సింగ్ వెల్లడించారు.
“ఇది చాలా దురదృష్టకర ఘటన. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే ప్రాథమికంగా కొన్ని విషయాలు తెలిశాయి. హత్య జరగడానికి ముందు.. పాదం వాచిందని లోహియా ఏదో నూనె రాసుకుంటున్నట్టు తెలిసింది. ఆ సమయంలో నిందితుడు డీజీకి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం పగిలిన సీసాతో గొంతు కోశాడు. మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు. లోహియా గదిలో మంటలు రావడాన్ని బయట ఉన్న భద్రతా సిబ్బంది చూశారు. లోపల నుంచి లాక్ చేసి ఉన్న గది తలుపులను బద్దలుకొట్టి వారు వెళ్లారు. పని మనిషి పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నాం” అని చెప్పారు ముకేశ్.
1992 బ్యాచ్‌కు చెందిన హేమంత్ కుమార్ లోహియా.. ఆగస్టులో జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు స్వీకరించారు.