మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను కొడవలితో నరికి చంపింది. అనంతరం భవనంపై దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఒక కుమారుడు అక్కడికక్కడే మరణించగా.. మరో చిన్నారి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. ఇక తల్లి కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అసలేం జరిగిందంటే?
తేజస్విని రెడ్డి అనే మహిళ గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన తేజస్విని తన ఇద్దరు కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద కుమారుడు హర్షిత్ స్పాట్ డెడ్ కాగా.. తీవ్రంగా గాయపడిన చిన్న కొడుకు ఆశిష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. చనిపోయే ముందు తేజస్విని ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.