జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మళ్లీ ఉగ్ర పోరు సాగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఇవాళ తెల్లవారుజామన జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. వాళ్లలో ఒకరు మేజర్. మరొక జవాన్ కు గాయాలయ్యాయి. పింగలాన్ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానం కలిగిన నిఘా వర్గాలు ఆర్మీకి సమాచారం అందించాయి. ఆర్మీకి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ కమాండోలు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి తనిఖీలు చేస్తుండగానే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి.
ఎదురు కాల్పుల్లో మేజర్ డీఎస్ దోండియల్, హెడ్ కానిస్టేబుల్ సవేరాం, జవాన్లు అజయ్ కుమార్, హరిసింగ్ లు ఎన్ కౌంటర్ లోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గుల్జార్ మహ్మద్ ను హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు పౌరులు కూడా మృతి చెందారు.
అయితే… పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగి 49 మంది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే అదే ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాదులు విరుచుకుపడటం… ఈ ఘటనలోనూ భారత జవాన్లు అమరులవ్వడంతో దేశమంతా మరోసారి ఉలిక్కిపడింది. దాయాది పాకిస్థాన్ పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని… పాకిస్థాన్ పై మరో సర్జికల్ స్ట్రయిక్స్ జరగాల్సిందేనని దేశమంతా ముక్తకంఠంతో చెబుతోంది.