సెలవుదినం ఆదివారం రోజున శ్రీలంక బాంబుల మోతతో దద్దరిల్లింది. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈస్టర్ పవిత్ర దినాన మూడు చర్చీలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉగ్రమూకలు నరమేధం సృష్టించారు. చర్చీలు, హోటళ్లలో బాంబు పేలుళ్లు సంభవించడంతో ఇప్పటి వరకు 137 మంది మరణించగా.. 400 మంది దాకా గాయపడ్డారు.
చర్చీలు, హోటళ్లలో కలిపి మొత్తం 6 పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కొలంబోలోని కోచ్చికడే, నెగోంబో, బట్టికలోవా ప్రాంతాల్లో ఉన్న మూడు చర్చీల్లో పేలుళ్లు సంభవించాయి. మరోవైపు కొలంబోలోని షాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటళ్లలో పేలుళ్లు జరిగాయి.
పేలుళ్ల ధాటికి పలువురు విదేశీ పర్యాటకులు కూడా మృతి చెందారు. నెగోంబోలో 50 మంది, సెయింట్ ఆంథోనీ చర్చ్ లో 30 మంది మరణించారు.
ప్రజలు సంయమనం పాటించండి..
పేలుళ్లను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఖండించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని తెలిపారు. దర్యాప్తులో అధికార యంత్రాంగానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
పేలుళ్లను శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా తీవ్రంగా ఖండించారు. శ్రీలంక ప్రజలంతా దృఢంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
I strongly condemn the cowardly attacks on our people today. I call upon all Sri Lankans during this tragic time to remain united and strong. Please avoid propagating unverified reports and speculation. The government is taking immediate steps to contain this situation.
— Ranil Wickremesinghe (@RW_UNP) April 21, 2019
శ్రీలంక పేలుళ్ల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మన దగ్గర ఇటువంటి అనాగరిక చర్యలకు తావు లేదు. శ్రీలంక ప్రజలకు భారత్ తరుపున సంఘీభావం తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు.
Strongly condemn the horrific blasts in Sri Lanka. There is no place for such barbarism in our region. India stands in solidarity with the people of Sri Lanka. My thoughts are with the bereaved families and prayers with the injured.
— Chowkidar Narendra Modi (@narendramodi) April 21, 2019