కోతులకు భయపడి.. చెరువులో దూకిన ఇద్దరు బాలురు మృతి

నిజామాబాద్ జిల్లా దసరా నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. మాక్లూర్​ మండలం మామిడిపల్లికి చెందిన 19 ఏళ్ల దీపక్, 14 ఏళ్ల రాజేశ్, 12 ఏళ్ల అఖిలేశ్, అభిలాష్, హన్మంతు.. దేవీ నవరాత్రుల సందర్భంగా మాల ధరించారు. గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి విగ్రహం వద్ద పూజలో పాల్గొంటున్నారు. సోమవారం కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు చేసేందుకు లింగం చెరువు వద్దకు వెళ్లారు.

కట్టపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వీరిపైకి కోతుల గుంపు దూసుకొచ్చింది. భయపడిన వారు ఎటు వెళ్లాలో తెలియక చెరువులో దూకారు. ఈత వచ్చిన దీపక్.. తనకు తానుగా బయటకు రావడంతో పాటు అభిలాష్​ను కాపాడాడు. మరోవైపు రాజేశ్​ తన తమ్ముడు హన్ముంతును ఒడ్డుకు చేర్చాడు. అనంతరం స్నేహితుడు అఖిలేశ్​ను రక్షించేందుకు వెళ్లగా ఇద్దరూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు రాజేశ్​ డిచ్​పల్లి గురుకులంలో ఏడో తరగతి, అఖిలేశ్​ మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు.