ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. కానీ.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో తెలుసా? పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయాలంటూ ఆమె భర్త వేధింపులను తట్టుకోలేక. అవును.. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలోని డిండిలో చోటు చేసుకున్నది. డిండిలోని నిజాంనగర్ కు చెందిన రాధకు ఎర్రగుంటపల్లికి చెందిన లింగమయ్యతో ఎనిమిది నెలల కింద వివాహమయింది.
పెళ్లి సమయంలో బండి పెడతామని రాధ తల్లిదండ్రులు అల్లుడికి మాటిచ్చారు కానీ.. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంకా బండిని కొనివ్వలేదు. దీంతో కొన్ని రోజుల నుంచి రాధను బండి కోసం వేధించసాగాడు లింగమయ్య. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజయింది. ఎర్రగుంటపల్లిలో ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది. దీంతో.. రాధను సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటూ లింగమయ్య ఒత్తిడి తీసుకొచ్చాడు. దాంతో పాటు బైక్ కూడా తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు.
దీంతో భర్త టార్చర్ ను తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన రాధ… నిజాంనగర్ లో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు కూడా ఆమెను పట్టించుకోలేదు. దీంతో చనిపోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఈ ఘటనను గమనించిన రాధ తల్లిదండ్రులు తనను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రాధ చికిత్స పొందుతూ మృతి చెందింది.