అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నది కల్పిత కథ. అందులో అల్లావుద్దీన్‌కు దీపం దొరకడం, భూతం ప్రత్యక్షమై కోరుకున్నవి క్షణాల్లో ఇవ్వడం.. అంతా కల్పితమే. అయినప్పటికీ అది నిజంగా ఉందనుకుని కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా కువైట్‌లోనూ ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
కువైట్‌కు చెందిన 37 ఏళ్ల ఓ మహిళకు దీపంలోని జిన్ ఆవహించిందని ఆమెకు చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు చెప్పారు. దీంతో ఆమె నమ్మింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహిళలు ఆమెను ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లగా అతను జిన్‌ను వదిలిస్తానని చెప్పి పూజలు చేశాడు. తరువాత ఆమె నుంచి 30వేల దినార్లను (దాదాపుగా రూ.73 లక్షలు) ఫీజుగా తీసుకున్నాడు. అయితే ఆ పూజలు చేశాక వారి వ్యవహార శైలి చూసి అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా భారత్‌లోనూ ఇలాంటి ఓ సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. లండన్ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్ కు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని, బయటకు తీస్తామని చెప్పి కొందరు మోసం చేశారు. అతని నుంచి రూ.2.50 లక్షలు తీసుకుని ఉడాయించారు. ఈ తరహా సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.