తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. వర్షాలు తగ్గడంలో స్వామి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులతో కిక్కిరిసి పోయారు. కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు క్యూ లైన్ ఉంది. అయితే, గురువారం వెంకటేశ్వర స్వామివారిని 68,835 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 25,883 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.96 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.