ఏసీపీ నర్సింహారెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నర్సింహారెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించిన ఏసీబీ నిందితుల్లో 11 మంది అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఇక హైటెక్ సిటీ సర్వే నెంబర్ 64లోని 60 కోట్ల విలువైన భూమి కబ్జా చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. 2 వేల గజాల భూమిని 490 గజాలుగా విభజించి 4 డాక్యుమెంట్లు సృష్టించారు నిందితులు.
మొదట తల్లిదండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అనంతరం కొడుకుల పేరిట గిఫ్ట్ డీడ్ చేశారు. గిఫ్ట్ డీడ్ నుంచి నర్సింహా రెడ్డి భార్య పేరు మీదా అలానే మరో నలుగురు బినామీల పేరిట ఆ భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. విచారణలో ఆ 2 వేల గజాలను ప్రభుత్వ భూమిగా తేల్చారు రెవెన్యూ అధికారులు. ఎలాంటి భూ హక్కు లేకపోయినా దానిని ప్రైవేట్ భూమిగా నిందితులు మార్చేశారు. నర్సింహా రెడ్డి బినామీ ఆస్తులనూ భారీగా గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్‌లో 14 నివాసాలు, అనంతపురంలో 55 ఎకరాల భూమి నిర్థారించారు.