మిర్చి రైతుల ఇబ్బందులు తెలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు జగన్ వెళ్ళారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా ప్రజలపక్షాన ఆలోచించిన రోజు ఉందా అని మాజీమంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో రైతులతో మాట్లాడేందుకు గుంటూరు వెళ్తే పోలీసులు కనిపించలేదు. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో పోలీసులు తీరు సరైన పద్ధతిలో లేదు. 11 సీట్లు అంటూ మీకు ఇష్టం వచ్చినట్లు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ కి 40 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారని గుర్తించుకోవాలి.
జగన్ మిర్చి యార్డుకు వెళ్తానని ప్రకటించగానే ఇప్పుడు కేంద్రానికి లేఖ రాస్తాం అంటున్నారు. చంద్రబాబుకు వయస్సుతో పాటు సామర్థ్యం తగ్గిందేమో అనిపిస్తుంది. మీ వ్యూహకర్తలు ప్రజల నుంచి సమస్యలు డైవర్ట్ చేయటానికి సలహాలు ఇస్తున్నారా.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి. కేంద్రం నుంచి పవన్ ఎందుకు నిధులు తేలేక పోతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు సుద్దులు ఏమయ్యాయి అని మాజీ మంత్రి ప్రశ్నించారు.