కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో అభిమానులను అలరిస్తూ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫ్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే టాప్-2లో నిలిచే అవకాశం ఉంది. అలా జరగాలంటే రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌ను ఓడిపోవాల్సి ఉంటుంది.
సన్‌రైజర్స్ విజయాల్లో కెప్టెన్ కమిన్స్ పాత్ర ఎంతో కీలకం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిస్థితులకు తగ్గట్లుగా డెత్, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అదే సమయంలో తన బ్యాటింగ్ స్కిల్స్‌తోనూ భారీ స్కోర్లలో తన వంతు సాయం చేస్తున్నాడు. జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గర అయ్యాడు. కమిన్స్ ఓ గొప్ప ఆటగాడే కాదు.. మంచి మనసు ఉన్న వ్యక్తి. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించాడు. విద్యార్థులతో ముచ్చటించాడు. పాఠశాల ఆవరణలో ఉన్న గ్రౌండ్‌లో పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాడు. స్వతహాగా ఆల్‌రౌండర్ అయిన కమిన్స్.. వికెట్ కీపింగ్ కూడా చేశాడు. తన బ్యాటింగ్‌తో పిల్లలను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.