కేవైసీ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌తో బ్యాంకుల హోరు..!

-

మీ బ్యాంక్‌ అకౌంట్‌ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోండి.. లేదంటే మీ అకౌంట్‌ బ్లాక్‌ చేస్తాం.. అంటూ కస్టమర్లను భయపెట్టి వారి అకౌంట్లను హ్యాక్‌ చేసి వాటిలో ఉండే డబ్బును చోరీ చేసే సైబర్‌ నేరగాళ్ల గురించి ఇప్పటికే మనం అనేక సార్లు తెలుసుకున్నాం. నిత్యం ఈ తరహా ఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా బ్యాంకులే నేరుగా అలాంటి మెసేజ్‌లు పంపిస్తుండడంతో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి కొత్త కష్టాలు మొదలయ్యాయి.

ఈ మధ్య కాలంలో దాదాపుగా అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను కేవైసీ వివరాలు పంపాలని కోరుతున్నాయి. ఆ మేరకు ఆయా సంస్థలు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ సందేశాలు, ఈ-మెయిల్స్‌ను పంపుతున్నాయి. అయితే కేవైసీ వివరాలను ఎట్టి పరిస్థితిలోనూ అడగం.. అని గతంలో బ్యాంకులు చెప్పాయి. సైబర్‌ నేరాల పట్ల వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఆ సంస్థలు అలా చెప్పాయి. కానీ ఇప్పుడు అవే బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు కేవైసీ వివరాలను పంపమని అడుగుతుండడంతో వినియోగదారులు ఆ మెసేజ్‌లను నకిలీ మెసేజ్‌లని భావిస్తున్నారు. వారు వాటిని అసలు మెసేజ్‌లే అని నమ్మడం లేదు. దీంతో చాలా మందిలో ఈ విషయంపై సందేహాలు నెలకొన్నాయి.

అయితే నిజానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏవైనా సరే.. కేవైసీ వివరాలను తీసుకునే తమ సేవలను వినియోగదారులకు అందిస్తాయి. కానీ వినియోగదారులను అయోమయానికి గురి చేసేలా ఇప్పుడా సంస్థలు వ్యహరిస్తున్నాయి. దీంతో వారు తాము అసలు సంస్థలకే కేవైసీ పంపుతున్నామా, తమ సమాచారం చోరీ అవుతుందా, అసలు తమను కేవైసీ అడుగుతున్నది నిజమైన ఆర్థిక సంస్థలేనా.. అని సందేహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సంస్థలు వినియోగదారులకు ఈ విషయంపై చుక్కలు చూపిస్తున్నాయి.

కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే అకౌంట్‌ లేదా క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ అవుతుందంటూ ఆ సంస్థలు తీవ్రమైన ప్రచారం చేస్తుండడంతో చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తమ అకౌంట్లు, కార్డులు ఏమైపోతాయోనని వాపోతున్నారు. అయితే దీనికి నిజానికి ఆయా సంస్థలే బాధ్యత వహించాలి. సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు.. గతంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. తాము కేవైసీ వివరాలను నేరుగా కస్టమర్లను అడగము.. అని చెప్పి ప్రచారం చేశాయి. మంచిదే.. దాని వల్ల వినియోగదారులు అప్రమత్తంగానే ఉంటారు. కానీ ఇప్పుడే ఆయా సంస్థలే నేరుగా కేవైసీ వివరాలను అడుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేవైసీ ఇవ్వాలా, వద్దా అని సందేహిస్తున్నారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆర్‌బీఐ ఆదేశాలు అని చెప్పి కస్టమర్ల నుంచి కేవైసీ వివరాలను అడుగుతున్నాయి.. కానీ అసలు కేవైసీ లేకుండా అకౌంట్లను ఎలా తెరుస్తారు.. అని అడిగితే దానికి ఆయా సంస్థల ప్రతినిధులు సమాధానం చెప్పడం లేదని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. అనాలోచితంగా, అనవసరంగా.. ఇలాంటి అయోమయ నిర్ణయాలను అమలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఆయా సంస్థలు పునరాలోచన చేస్తాయా, లేదా అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version