కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో దాదాపు 45 రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన.. మందుబాబు షాపుల ముందు క్యూ కట్టారు. మద్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా కి.మీ మేర క్యూ లైన్లను కూడా లెక్కచేయడం లేదు. కొన్ని చోట్ల అయితే మద్యం కొనుగోలు చేసే క్రమంలో భౌతిక దూరం నిబంధనలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
చాలా రోజుల తర్వాత మద్యం కొనుగోలు చేసి మురిసిపోతున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్‌లో వడగండ్ల వాన కురుస్తున్నప్పటికీ.. మందుబాబులు తమ మద్యం కొనుగోలు చేయాలనే సంకల్పాన్ని వీడలేదు. ఓ వైపు వడగండ్ల వాన కురుస్తుంటే.. మద్యం కోసం జనాలు బారులు తీరి కనిపించారు. అందులో చాలా మంది గొడుగులు పట్టుకుని కనిపిస్తే.. కొందరు రెయిన్ కోట్లు ధరించి ఉన్నారు. అయితే మందుబాబులు వైన్ షాపు బయట గీసిన సర్కిళ్లలో నిలుచుని భౌతిక దూరం నిబంధన పాటించడం విశేషం.
కాగా, ఇప్పటివరకు భారత్‌లో 46,711 కరోనా కేసులు 1,583 మంది మృతిచెందారు. ఉత్తరాఖండ్ విషయానికి వస్తే.. 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 39 మంది కోలుకోగా, ఒకరు మృతిచెందారు.