ఆ మహిళ అనుమానం ఖరీదు ఓ దళితుడి నిండు ప్రాణం!

-

తమిళనాడులోని విలుప్పురంలో దారుణం జరిగింది. ఓ మహిళ అనుమానం ఒక దళితుడి నిండు ప్రాణం తీసింది. దారివెంట వెళ్తున్న దళిత వ్యక్తి తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అనుమానించిన మహిళ కేకలు వేయడంతో.. ఆమె భర్త, బంధువులు ఆ దళిత వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడు ఆ తర్వాత చనిపోయాడు.

శక్తివేల్‌ అనే దళితుడు విలుప్పురంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా డ్యూటీకి వెళ్తూ ఊరి బయట మూత్రవిసర్జన కోసం ఆగాడు. అయితే అప్పటికే అక్కడ బహిర్భూమికి వచ్చిన మహిళ.. తనను చూసే అతడు తనవైపు వస్తున్నాడని అనుమానించి గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడ్డ శక్తివేల్ అక్కడి నుంచి పరుగుతీశాడు. అయితే అప్పటికే మహిళ కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఆమె భర్త, బంధువులు శక్తివేల్‌ను వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు.

విషయం తెలుసుకున్న శక్తివేల్‌ సోదరి.. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే ఆ తర్వాత కాసేపటికే అతడు మృతిచెందాడు. శక్తివేల్‌ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు మహిళలు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version