సినిమాలు చూసి జనాలు నేర్చుకుంటున్నారో లేక జనాన్ని చూసే సినిమాలు తీస్తున్నారో తెలియదు కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన మాత్రం సంచలనంగా మారింది. వరంగల్ పోలీసులు దండుపాళ్యం సినిమాను తలపించేలా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పిట్టల వినోద్ అలియాస్ పార్థి అనే అంతర్ జిల్లా దొంగ పగలు బిచ్చగాడి వేషాదారణలో సంచరిస్తూ రెక్కీ చేస్తాడు. రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలు చేస్తూ ఉంటాడు.
అలా వరుస చోరీలకు పాల్పడుతున్న అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 40 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, 1కిలో90 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 ప్రాంతాల్లో చోరీలకు నిందితుడు పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని విచారించి ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడు అనే విషయాన్ని రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.