అసలు రైతు దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు…?

-

మన దేశంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యత గురించి అందరికి తెలిసిందే. వ్యవసాయాన్ని మన దేశంలో దైవంలా కొలుస్తూ ఉంటారు. అయితే మన దేశంలో రైతు దినోత్సవంగా డిసెంబర్ 23ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 న జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివాస్‌ ను మనం జరుపుకుంటాం. భారత ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకుంటారు.

చౌదరి చరణ్ సింగ్ స్వల్ప కాలం పదవిలో ఉన్నా సరే ఆయన రైతుల కోసం చేసిన సేవలకు గుర్తుగా నేడు రైతు దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. జూలై 1979 నుండి 1980 జనవరి వరకు ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. చౌదరి చరణ్ సింగ్ రైతుల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటుగా వారి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి రైతు అనుకూలమైన విధానాలను రూపొందించారు. చౌదరి చరణ్ సింగ్ 1902 లో మీరట్ లోని నూర్పూర్ వద్ద ఒక రైతు కుటుంబంలో జన్మించారు.

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మరియు ఆర్థిక వ్యవస్థలో రైతు స్థానాన్ని గుర్తించిన ఆయన వారి కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను వ్యతిరేకించిన సమయంలో ఆయనను ప్రత్యేక నాయకుడిగా గుర్తించారు. 1959 నాగ్‌పూర్ కాంగ్రెస్ సెషన్‌ లో, చౌదరి చరణ్ సింగ్ నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించారు. సామూహిక మరియు సోషలిస్టు భూ విధానాలపై బహిరంగ విమర్శలు చేసారు.

భారతీయ రైతుల సమస్యలపై అనేక పుస్తకాలను కూడా రచించారు. రైతు సమస్యలకు పరిష్కారాలను కూడా ఆయన చూపించారు. భారత ప్రభుత్వం ఆయన చేసిన కృషిని గుర్తించి పలుసార్లు సత్కరించింది. చౌదరి చరణ్ సింగ్ స్మారకాన్ని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. ఆయన జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. లక్నోలోని అమౌసి విమానాశ్రయానికి చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు మార్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version