ఐసీఐసీఐ బ్యాంకు, వీడియో కాన్ గ్రూప్ మధ్య జరిగిన లావాదేవీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందన్న అభియోగాలపై బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. దీపక్‌ను చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నించిన ఈడీ అధికారులతోపాటు ఆయన తరఫు న్యాయవాది క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించారు.
ఇకపోతే చందాకొచ్చర్ సీఈవోగా వ్యవహరించిన సమయంలో వీడియోకాన్ సంస్థతో పాటు మరో ఏడు సంస్థలకు మంజూరైన రుణాలపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. ఏడు సంస్థలకు కలిపి రూ.7862 కోట్ల రుణాలు అక్రమంగా,నేరపూరితంగా మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్ సంస్థకు రూ.1875 కోట్లు రుణ మంజూరుకు సంబంధించి చందా కొచ్చర్ క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.