అసెంబ్లీలో హైడ్రామా.. రైతు చట్టాల ప్ర‌తుల‌ను చించేసిన సీఎం !

-

ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది. వ్యవసాయ చట్టాల ప్రతులను చింపివేశారు సీఎం కేజ్రీవాల్. కరోనా కాలంలో అత్యవసరంగా పార్లమెంట్‌లో బిల్లులను ఆమోదించారని మండిపడ్డారు. రాజ్యసభలో ఓటింగ్‌ జరగకుండ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను ఆమోదించిందన్నారాయన. వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేజ్రీ వాల్. ఇక రైతు చట్టాలకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల కష్టాలేంటో మాకు తెలుసు. మేమూ ఈ దేశ పౌరులమే. ఆందోళనలు చేయడమే మీకున్న ప్రత్యామ్నాయం అనేది కూడా మాకు తెలుసు. 

మీరు కోర్టుని ఆశ్రయిస్తే.. మీ సమస్య పట్ల సానుకూలంగా స్పందిస్తాం. కమిటీని ఏర్పాటు చేస్తామంటూ రైతులకు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్ని అక్కడ నుంచి పంపించేయాలన్న పిటిషన్‌పై కోర్టు విచారించింది. చట్టాల అమలు తాత్కాలికంగా నిలిపేస్తే రైతులు కేంద్రంతో చర్చలకు ముందుకొస్తారేమో పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. కోర్టు సూచనపై స్పందించిన అడ్వకేట్ జనరల్ రైతులతో చర్చలకు కేంద్రం సుముఖంగా ఉందని.. చర్చల తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశామని.. వారు కోర్టుకు ఏదైనా చెప్పాలంటే వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించవచ్చని చెప్పింది సుప్రీంకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version