కరోనా లాక్డౌన్ సమయంలో చేసిన సేవా కార్యక్రమాలతో సినీ నటుడు సోనుసూద్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయం లోనే కాక ఇప్పటికీ కూడా తన సేవా కార్యక్రమాలను సోనూ కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం… విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడం.. అనారోగ్యం బారిన పడిన వారికి ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించడం. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోను సూద్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సోనూ సూద్ భేటీ అవ్వడం తో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటర్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా తాను ఎంపికైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే పది లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికోసమే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారని కానీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో సోనూ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనూ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అనేక రకాల వార్తలు వచ్చాయి.