దిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. పోస్టుమార్టం రిపోర్టులో ఏం ఉందంటే..?

-

దిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుల్తాన్‌పురికి చెందిన మృతురాలు అంజలి సింగ్‌(20) భౌతికకాయానికి పరీక్ష నిర్వహించిన వైద్యబృందం.. ఆమె జననాంగాలపై ఎటువంటి గాయాలు లేవని తేల్చింది. వారి నివేదికను బట్టి.. ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. యువతిపై అత్యాచారం జరిగి ఉంటుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే.

దిల్లీలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ బోర్డు సోమవారం రోజున శవపరీక్ష నిర్వహించింది. ఆదివారం ప్రమాదం జరిగిన సమయంలో అంజలి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు సీసీటీవీల పరిశీలన ద్వారా పోలీసులు గుర్తించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు మంగళవారం నమోదు చేశారు.

ఆ ప్రకారం ప్రమాదం జరిగిన రాత్రి కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా అంజలి, తాను కలిసి కొంతమంది స్నేహితులను కలిసేందుకు ఓ హోటల్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపింది. పార్టీ అనంతరం మద్యం సేవించి ఉన్నప్పటికీ స్కూటర్‌ నడపాలని అంజలి కోరుకున్నట్లు చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించింది. మరోపక్క పటిష్ఠ బందోబస్తు మధ్య అంజలి భౌతికకాయానికి కుటుంబసభ్యులు మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news