దిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఆప్ సర్కార్ కు ఈసారి భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రకటనలను పార్టీ సొంత ప్రచారం కోసం వాడుకున్నారంటూ.. వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని ఆప్‌ను ఆయన తాజాగా ఆదేశించారు. దిల్లీ ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు చేసిన ఈ మొత్తాన్ని పార్టీ నుంచి వసూలు చేయాలని చీఫ్ సెక్రెటరీకి సూచించారు.
ప్రభుత్వ ప్రకటనలపై 2016లో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలతో పాటు సుప్రీం కోర్టు, దిల్లీ హైకోర్టులు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారన్న కారణాలపై వీకే సక్సేనా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన కొద్ది రోజుల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
మరోవైపు.. ఎల్‌జీ ఆదేశాలపై ఆప్ స్పందించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం లేదని పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇస్తుందని.. అయితే, కేవలం ఆప్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. దిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు.