యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం అయినప్పటికీ సూపర్ ఓవర్‌లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది.
మ్యాచ్‌లో ముందుగా పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో స్టాయినిస్ (21 బంతుల్లో 53 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయాస్ అయ్యర్ (32 బంతుల్లో 39 పరుగులు, 3 సిక్సర్లు)లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, కాట్రెల్ 2, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కూడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మయాంక్ అగర్వాల్ (60 బంతుల్లో 89 పరుగులు, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో రబాడా, అశ్విన్, స్టాయినిస్‌లకు తలా 2 వికెట్లు దక్కాయి. మోహిత్ శర్మ, అక్షర్ పటేల్‌లు చెరొక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.
సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కేవలం 3 బాల్స్ మాత్రమే ఆడి 2 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 3 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.