ట్రంప్‌ కి కెరీర్ లేకుండా చెయ్యాలని డిసైడయ్యారా

-

ట్రంప్‌ను మామూలుగా టార్గెట్ చెయ్యట్లేదు. అగ్రరాజ్యంలో ఆయనకు పొలిటికల్ కెరీరే లేకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యారు డెమొక్రాట్స్. పర్మనెంట్‌గా ఆయన్ని ఇంటికే పరిమితం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రంప్‌ భవిష్యత్‌లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా, మరే పదవిలో అడుగుపెట్టకుండా నిషేధం విధించేందుకు… ఉచ్చు బిగిస్తున్నారు డెమొక్రాట్లు.

అమెరికాలో ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన టాక్ నడవాలి.. కానీ ఇప్పుడు అక్కడంతా ట్రంప్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు ట్రంప్‌ స్టేట్‌మెంట్సే కారణం. కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి నేను రాను అని డైరెక్ట్ గా చెప్పేశారు ట్రంప్. అమెరికా చరిత్రలో గత 152 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో కొందరు అధ్యక్షులు రాకుండా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రాకుండా ఉన్నారుగానీ.. రానని ముందే చెప్పిన తీరు మాత్రం 1869 తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగింది.

ట్రంప్ స్టేట్‌మెంట్స్‌, క్యాపిటల్‌ భవనంపై దాడి నేపథ్యంలో రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు డెమొక్రాట్లు. అందుకే ట్రంప్‌ను పదవీ నుంచి తొలగించేందుకు ప్లాన్ వేస్తున్నారు. జనవరి 20 వరకూ కూడా ఆయన్ని పదవిలో ఉంచకుండా ముందుగానే ఇంటికి పంపాలనుకుంటున్నారు. భవిష్యత్తులో ట్రంప్‌ అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయకుండా చేయాలనుకుంటున్నారు డెమొక్రాట్లు. ట్రంప్‌కు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఉంది. కానీ 2024లో ఆయన అసలు బరిలో దిగకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు డెమొక్రాట్లు.

ట్రంప్‌పై అభిశంసన తీర్మానం చేసి గానీ, లేదా 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి గానీ పదవి నుంచి సాగనంపాలనుకుంటున్నారు. ట్రంప్‌ను జనవరి 20కి ముందే పదవిలో నుంచి దించాలంటే కాస్త కష్టమే. కానీ భవిష్యత్‌లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించే తీర్మానాన్ని సెనేట్‌ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ తీర్మానం నెగ్గటానికి సాధారణ మెజార్టీ చాలు.

ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు అభిశంసన ప్రక్రియ మొదలెట్టి… బైడెన్‌ అధ్యక్షుడయ్యాక దాన్ని కొనసాగించొచ్చు. అప్పుడు సెనేట్‌లోనూ డెమొక్రాట్లకు బలం పెరుగుతుంది. దీంతో అభిశంసన నెగ్గటానికి అవకాశాలుంటాయి. అలా ట్రంప్‌ భవిష్యత్‌లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా, మరే పదవిలో అడుగుపెట్టకుండా నిషేధం విధించేందుకు… ఉచ్చు బిగిస్తున్నారు డెమొక్రాట్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version