ఆంధ్రప్రదేశ్‌లో ఫేక్ ట్విట్‌లతో రచ్చ నడుస్తోంది. గతవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యల మధ్య జరిగిన ట్విట్ పోరు వైరల్ అయింది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మరో ట్విట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ విషయంపై దేవినేని ఉమ స్వయంగా రంగంలో దిగారు. తన పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్ సృష్టించి పోస్టులు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు నకిలీ ట్విట్‌ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటి రాంబాబుపై మంగళవారం సీఐడీ డీఐజీ సునీల్ నాయక్‌ను కలిసి ఫిర్యాదు ఇచ్చారు. నకిలీ ట్విట్‌ను తనతోపాటు అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్విట్ చేసినట్లు ఒక ఫేక్ ట్విట్ వైరల్ అవుతోందన్నారు. అసలు ఆ ట్విట్ తాను పోస్ట్ చేయలేదని దేవినేని పేర్కొన్నారు. టీడీపీ నేతలైన వర్ల రామయ్య, బుచ్చల అర్జునుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లతో ఫేక్ ట్విట్‌లు చేస్తున్నారని, ఆఖరికి చంద్రబాబు సంతకం, పార్టీ లెటర్ హెడ్ ఫోర్జరీ చేశారని దేవినేని ఆరోపించారు. మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు ఫేక్ ట్విట్‌లను సమర్ధించడం విడ్డూరంగా ఉందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికే మంత్రి ఫేక్ ట్విట్లను షేర్ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయం సీఎం జగన్ సమాధానం ఇవ్వాలన్నారు.