ములుగు జిల్లా వెంకటాపురంలో తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి పర్యటన ముగిసింది. తెలంగాణ – చత్తీస్గడ్ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు చేపట్టనున్న వ్యూహ ప్రణాళికలపై నాలుగు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు డిజిపి మహేందర్ రెడ్డి. తెలంగాణ – చత్తీస్గడ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మావోయిస్టుల కదలికలను నియంత్రించాలని అధికారులకు సూచనలు చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. మావోయిస్టు పార్టీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో డీజీపీ రంగంలోకి దిగినట్లు సమాచారం. డిజిపి మహేందర్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
అలాగే మెహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజి ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.