అంతటా అస్తవ్యస్తంగా ఉన్న పాలనలో మరో కొత్త ప్రతిపాదన దుమారం రేపుతోంది. కొద్ది ఏళ్లు ఆగితే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఉండగా ఇప్పుడెందుకు జిల్లాల పునర్విభజన అన్నది ఓ డైలమా అందరిలోనూ ఉంటుండగానే కొత్త ప్రకటన వచ్చేసింది. దీని వల్ల ఎంత లాభమో అన్నది సాక్షాత్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేకపోతున్నారు. జిల్లాల పెంపు కారణంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కాస్తో కూస్తో పెరుగుతాయన్న ఓ చిన్న ఆశ జగన్ లో ఉంది. ఆ కారణంగానే ఆయన జిల్లాల పెంపునకు మొగ్గు చూపి ఉంటారు. ఇది మినహా జిల్లాల పెంపు కారణంగాకొత్తగా ఏదో జరిగిపోతుందన్న భ్రమలు అయితే ప్రజలకు లేవు.అదే సమయంలో నాయకులకూ లేవు.ఉండవు.ఉండకూడదు కూడా!ఈ నేపథ్యంలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటయిన శ్రీకాకుళం జిల్లాకు దివంగత నేత ఎర్రన్నాయుడు పేరు ఉంచాలన్న ప్రతిపాదనలపై అప్పుడే తర్జనభర్జనలు మొదలయ్యాయి.రాజకీయంగా చూడకున్నా సామాజికంగా ఆయన పేరుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఎర్రన్న పేరును జిల్లాకు పెడితే తప్పేంటి అన్న ప్రశ్న ఒకటి, వాదన ఒకటి బలీయంగా వినిపిస్తోంది.దీనిపై జగన్ ఏమంటారో?
కొత్త జిల్లాల పేరిట యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది.ఇప్పటిదాకా విభజనతోనే చాలా నష్టపోయి ఉన్న ఆంధ్రాకు మళ్లీ మరో విభజన అవసరమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.ముఖ్యంగా జిల్లాల ఏర్పాటుతో చాలా వరకూ ఐటీడీఏలను కోల్పోయి, సంబంధిత నిధులు కోల్పోయి అనాథలుగా మారిన జిల్లాలు ఆంధ్రాలో ఉన్నాయి.అందుకే జిల్లాల పునర్విభజనను చాలా మంది అప్పట్లో వ్యతిరేకించారు.ఎవరెన్ని చెప్పినా తానేం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు కనుక జగన్ తన నిర్ణయంలో మార్పు ఉండదు అని చెప్పేశారు.ఆ విధంగానే తన నిర్ణయాన్ని అమలు చేసేశారు.
ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎప్పటి నుంచో ఎర్రన్నాయుడు (దివంగత టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి) పేరు పెడతామని అంటున్నారు పాలకులు.టీడీపీ హయాంలో అది నెరవేరలేదు కానీ ఎర్రన్నాయుడు జయంతి,వర్థంతులు మాత్రం అధికారికంగానే నిర్వహించారు. ఆ విధంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల పేరిట కొత్త కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి కనుక ఎర్రన్నాయుడు పేరు శ్రీకాకుళం జిల్లాకు పెడితే బాగుంటుంది అని ఆలోచన మళ్లీ టీడీపీలో ఉదయిస్తోంది. అందుకు తగ్గ పోరాటమో లేదా ఒత్తిడో తీసుకుని రావాలని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు (యువ ఎంపీ, శ్రీకాకుళం), అదేవిధంగా కుమార్తె ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి ఎమ్మెల్యే), వీరితో పాటు ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు (టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే) ఇలా వీరంతా వివిధ పదవుల్లో ఉన్నారు కనుక అసెంబ్లీ బయటా, లోపల ప్రభుత్వ ప్రతినిధులపై ఒత్తిడి తీసుకు వస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఒకటి ఉంది.ఒకవేళ అనుకున్న విధంగా జరిగితే ఆవిధంగా ఎర్రన్నకు తగిన గౌరవం దక్కించిన వారు అవుతారు అని కూడా అంటున్నారు కింజరాపు కుటుంబ అభిమానులు.