ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చర్చ నడుస్తోంది. ఆ విధంగా నాటి సాగునీటి పారుదల శాఖ (జలవనరుల శాఖ అని రాయాలి) మంత్రి అనిల్ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. ఆయన నేతృత్వంలోనే టెండరింగ్ ప్రాసెస్ లో భాగంగా కొత్త కంపెనీ వచ్చి చేరింది. అప్పటిదాకా ఉన్నా ట్రాన్స్ ట్రాయ్ ప్లేస్ లో మేఘా కంపెనీ వచ్చి చేరింది. ఏదేమయినప్పటికీ 70 శాతం పనులు అప్పటి ప్రభుత్వం నేతృత్వంలోనే పూర్తయ్యాయి. అంటే జగన్ నేతృత్వాన 30 శాతం పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. అందుకే ఆయన ఈ పనులపై దృష్టి సారించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కానీ అనిల్ నేతృత్వాన పనులు మందకొడిగానే సాగాయి అన్నది నిజంగానే అంగీకరించాల్సిన విషయం.
ముఖ్యంగా సాగునీటికి సంబంధించిన పనులు అన్నీ తామే చూసుకుంటాం కానీ తాగునీటి పనులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలని కేంద్రం ఓ మెలిక పెట్టింది. వాస్తవానికి పోలవరం ఓ బహుళార్థ సాధక ప్రాజెక్టు. అటు సాగు, తాగు నీరు అందుబాటులోకి తేవడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి అన్నది ఇక్కడ మరో కీలక అంశం. కనుక ఇవన్నీ జరగాలంటే పనుల్లో డొల్లతనం ఉండకూడదు. కానీ ఎందుకనో అంచనా వ్యయం మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది. అందుకు సాంకేతిక కారణాలు, మార్కెట్ పరిణామాలు దోహదం అయినా కూడా వ్యయ సంబంధం అయిన కొన్నింటిని ఇంకా తగ్గించవచ్చు. ఆ విధంగా పోలవరం ఓ బెస్ట్ ఛాయిస్ కానుంది అందరికీ !
ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ దీనిపై తనను ఏమీ అడగవద్దు అని చెప్పడంతో చాలా మంది అవాక్కయ్యారు. ఇంకా చెప్పాలంటే యావత్ రాష్ట్రమే నివ్వెరపోయింది. ఇదే దశలో ఆ రోజు ఇదే శాఖ చూసిన లేదా నిర్వహించిన దేవినేని ఉమ మాత్రం పోలవరానికి సంబంధించి చర్చ ఎక్కడ పెట్టినా వచ్చేందుకు, మాట్లాడేందుకు, వాస్తవాలు వివరించేందుకు తాను సిద్ధమేనని బహిరంగ సవాల్ విసిరిన సందర్భం ఒకటి గుర్తుకు వస్తుంది. అయితే ఆయన మాదిరి ఈయన కూడా మాట్లాడి ఉంటే బాగుండేది కానీ అనిల్ మాత్రం వీటిపై మాట్లాడకుండా రాష్ట్రావసరాలు గురించి ఆ రోజు తానేం చేశానో చెప్పకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తూ తన పరువు తానే తీసుకుంటున్నారని జనసేన మండిపడుతోంది. తమ అధినేతనో మరొకరినో తిట్టేందుకు కాదు కదా ఆ రోజు మంత్రి పదవి అందుకున్నది అని టీడీపీ కూడా హితవు చెబుతోంది. ఎవరు ఎన్ని చెప్పినా తాను మాత్రం వెనక్కు తగ్గనని స్పష్టం చేస్తూ వస్తున్నారు అనిల్.