కరోనా పుణ్యమా అని దేశంలో డిజిటల్ మీడియా పండగ చేసుకుంటోంది. గతంలో.. అంటే.. కరోనా లాక్‌డౌన్ కన్నా ముందు నిత్యం జనాలు సోషల్ మీడియాలో గడుపుతున్న సమయం 1.50 గంటలు కాగా ఇప్పుడు నిత్యం 4 గంటలకు పైగానే సోషల్ మీడియాలో జనాలు విహరిస్తున్నారు. ఇక మార్చి 25వ తేదీ నుంచి మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగం 30 శాతం పెరిగిందని అటు టెలికాం కంపెనీలు చెబుతున్నాయి.
దేశంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి యూట్యూబ్‌లో వీక్షకుల సంఖ్య బాగా పెరిగిందని, మొత్తం 300 బిలియన్ల వ్యూస్ అదనంగా వచ్చాయని మైండ్ షేర్ అనే మీడియా బయింగ్ ఏజెన్సీ, విడూలీ అనే అనలిటిక్స్ సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది. ఇక దేశంలో యూట్యూబ్‌ను వాడుతున్న మొత్తం యూజర్లలో 18 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారే అధికంగా ఉన్నారని తేలింది.
కరోనా లాక్‌డౌన్ కారణంగా జనాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో వార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ యాప్‌లు, వెబ్‌సైట్లను చూస్తున్నారని మైండ్‌షేర్, విడూలీ సంస్థలు తెలిపాయి. ఇక లాక్‌డౌన్ కాలంలో యూట్యూబ్‌కు 20.5 శాతం మంది కొత్త సబ్‌స్క్రైబర్లు వచ్చి చేరారని ఆ సంస్థలు తెలిపాయి. అలాగే వార్తల విషయానికి వస్తే.. ఓవరాల్ కంటెంట్‌లో జనాలు ఎక్కువగా కరోనాకు సంబంధించిన సమాచారాన్నే తెలుసుకుంటున్నారని వెల్లడైంది. ఇక జనాలు ఎక్కువగా సందర్శిస్తున్న యాప్‌లు, సైట్లలో వంటలు, గేమింగ్, ఇతర సమాచారాన్ని అందించేవే ఎక్కువగా ఉంటున్నాయని.. ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి.