పవిత్రమైన భారత నేలపై గోవధ చేసి ఆ మాంసం తినటం క్షమించరాని నేరమని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. బుర్దావన్‌లో సోమవారం జరిగిన గోపా అష్టమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆవుని తల్లితో పోల్చారు. గోవు మన తల్లి అని చెప్పిన ఆయన ఆమె పాలు తాగి మనం బ్రతుకుతున్నామని, అలాంటి తల్లితో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే సహించనని స్పష్టం చేసిన ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం కూడా తినాలంటూ ఆయన సలహా ఇచ్చారు.
మేధావులంతా రోడ్లపై బీఫ్ తింటున్నారని… ఇకపై వారు అన్ని రకాల జంతువులను కూడా ఇలాగే చంపి తింటే ఆరోగ్యం బాగుంటుందని ఆయన హితవు పలికారు. ఆవు పాలను బంగారంతో పోల్చారు. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయన్న ఆయన… ఆవు మామాసం తింటే మంచిది అని ప్రచారం చేస్తున్న వాళ్ళు రోడ్లపై పడి కుక్క మా౦సం కూడా తింటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అయితే దానిని ఇంట్లో తినమని సలహా ఇచ్చిన ఆయన రోడ్లపై హడావుడి చేయవద్దని వారికి సూచించారు. గొ హత్య మహా పాపమన్నారు.
దేశీ ఆవులు అమ్మతో సమానం కాబట్టి.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన.. విదేశీ ఆవు జాతులను పెంచడం శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో విదేశీ వనితలను భార్యలుగా చేసుకున్న వారు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుపోయారో గమనించాలి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు బెంగాల్ లో బిజెపి బలపడే ప్రయత్నాల్లో ఉన్న నేపధ్యంలో అక్కడ భారీగా ఉన్న హిందు ఓటు బ్యాంకు ని తమవైపుకి తిప్పుకునే ప్రయత్నాలను వివాదాస్పద వ్యాఖ్యలతో చేస్తుందని, అక్కడి పార్టీలు మండిపడుతున్నాయి..