ప్రాణాలు ముఖ్యం.. పదవులు వరించిన వేళ అత్యుత్సాహం వద్దు..కొన్ని విషాద ఘటనల దృష్ట్యా ఇప్పుడంతా అప్రమత్తం కావాలి. అదేవిధంగా జిల్లాలలో ర్యాలీల సమయంలో పోలీసులు అత్యుత్సాహం మానుకుని అత్యవసర సర్వీసులకు దారి ఇచ్చేందుకు సహకరించాలి. కేవలం మంత్రుల ర్యాలీలే కాదు ఆపద వేళ ప్రజల ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యం అని గుర్తిస్తే మేలు.
కార్యకర్తలు కూడా ఇదే విధంగా అతికి తావివ్వక పనిచేయాలి. పోలీసులకు సహకరించాలి. లేదంటే ప్రాణాపాయ పరిస్థితులు నెలకొనక తప్పవు. ఏదేమయినా ఓ సర్పంచ్ చనిపోయారు.ఓ చిన్నారి చనిపోయింది. కనుక జాగ్రత్త ! ఆ వివరం ఈ కథనంలో..
పదవి రావడం యోగం.. పదవి నిలుపుకోవడం బాధ్యత..మళ్లీ ఎన్నికల్లో గెలిచి రావడం అదృష్టం.. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటూ వారి కోసం శ్రమించండి అని చెప్పడం కర్తవ్య బోధ.. సీఎం జగన్ ఇదేవిధంగా ఎప్పటి నుంచో కర్తవ్య బోధ చేస్తూనే ఉన్నారు. పదవులు కన్నా ప్రజలే శాశ్వతం వారి నమ్మకమే మనకు శ్రీరామ రక్ష అని చెబుతూ తన మంత్రి వర్గ సహచరులను అప్రమత్తం చేస్తూ ఉన్నారాయన. త్వరలో జిల్లాల పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే సంబంధిత సమాచారంతో కొత్త మంత్రులు ఉంటే, సీఎం వచ్చే వేళకు సమీక్షలు సులువు అవుతాయి. ప్లీనరీ తరువాత అంటే జూలై తరువాత ఇంకొన్ని మార్పులు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ జరిగే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి.
కనుక సీఎం జగన్ ఆ విధంగా తనని తాను సన్నద్ధం చేసుకుంటూనే కొత్త మంత్రి వర్గ సభ్యులకు శాఖలపై పట్టు పెంచుకోవాలని ఆదేశిస్తూ ఉన్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష పూర్తయింది. ఈ శాఖకు ఖాళీల భర్తీతో పాటు ఆస్పత్రుల ఆధునికీకరణకు కూడా సమ్మతి ఇచ్చారు. ఇదే సందర్భంలో మరికొన్ని శాఖలపై సమీక్ష చేయాల్సి ఉంది. మరోవైపు జిల్లాలలో మంత్రుల ఆనందాలకు వారి సంబరాలకు కొదవే లేకుండా ఉంటోంది. పదవి వచ్చిన ఉత్సాహంలో అనుచరులు భారీ ర్యాలీలు తీస్తున్నారు. ఇదే సమయంలో ప్రాణాలు జాగ్రత్త అని కూడా చెబుతున్నారు వైసీపీ పెద్దలు.
ఈ నేపథ్యాన ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఎక్కడో ఓ చోట ఏదో ఒక సంబరం జరుగుతూనే ఉంది.ఆ విధంగా కొత్త మంత్రుల ఉత్సాహానికి అవధులే లేకుండా ఉన్నాయి.ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక రెండో సారి ఛాన్స్ కొట్టేసిన 11 మంది మంత్రుల ఆనందాలకు అవధే లేదు. ఎందుకంటే వీళ్లంతా మిగిలిన వారి కన్నా ఎంతో అదృష్టవంతులు. ఇంతటి పోటీ వాతావరణంలోనూ కొన్ని కారణాల రీత్యా వీరిని సీఎం కొనసాగించాల్సి వచ్చింది. అయితే కొత్త మంత్రుల పనితీరు, పాత మంత్రులకు మళ్లీ చోటు ఇవ్వడం వంటివి బాగానే ఉన్నా, వీళ్లంతా జగన్ 2.0 అనే కొత్త వెర్షన్ లో ఉన్న సర్కారు ను ఏ విధంగా నడిపిస్తారో అన్న ఆసక్తి ఒకటి ఇప్పుడు నెలకొని ఉంది.