తెలంగాణలో గత మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే తర్వాత బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.
జోగులాంబ అమ్మవారిపై వ్యంగ్యంగా మాట్లాడిన కేసీఆర్ పతనం ప్రారంభమైందని డీకే అరుణ అన్నారు. నీ ప్రశ్నలకు సమాధానాలు చేప్పే అవసరం ప్రధానికి లేదని, వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇవ్వాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని ఆమె విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని , కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆమె ధ్వజమెత్తారు.