దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. చాల మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా కొన్ని వేలమంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా ఈ వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, ఇతర వ్యాపారుల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. తద్వారా ముందే కరోనా కేసులను గుర్తించడంతో పాటు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.