జేఈఈ మెయిన్ 2020 ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యేవారికి మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే..!

-

కరోనా నేపథ్యంలో పరీక్ష నిర్వహణ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షల కోసం నిర్థిష్టమైన మార్గదర్శకాలు రూపొందించారు. పరీక్షలు సక్రమంగా జరగటానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం కోవిడ్‌-19 కారణంగా అదనపు మార్గదర్శకాలు, భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. జేఈఈ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డులో పొందుపరిచిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు.

పరీక్షా కేంద్రంలో చేయవలసినవి, చేయకూడనివి…

  • అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు తీసుకునే చర్యలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. సెక్యూరిటీ చెక్ చేయడంతోపాటు శానిటైజేషన్‌ చేస్తారు.
  • కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు స్లాట్లు కేటాయించనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ వినీత్ జోషి తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమకు కేటాయించిన స్లాట్లలోనే పరీక్షా కేంద్రానికి రావాలి.
  • పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అభ్యర్థులు తమతోపాటు గుర్తింపు రుజువును చూపించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రం లోపల ఇతర వస్తువులను అనుమతించరు.
  • పరీక్షా కోసం హాజరవుతున్న అభ్యర్థులు తమతోపాటు జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డును, ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్ళాలి.
  • బ్యాగులు కానీ, వేరే ఎలాంటి వస్తువులను కానీ పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు.
  • అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ, తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చోవాలి.
  • పేపర్‌ 2 కోసం అభ్యర్థులు జ్యామెట్రీ బాక్స్‌, కలర్‌ పెన్సిల్స్‌ తోపాటు క్రేయాన్స్‌లను మాత్రమే తమ వెంట తీసుకురావటానికి అనుమతి ఉంది. వాటర్‌ కలర్స్‌కి అనుమతి లేదు.
  • రఫ్‌ వర్క్‌ చేసుకోవటానికి ఖాళీ పేపర్‌, పెన్‌, పెన్సిల్స్‌ పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉంటాయి. పరీక్ష పూర్తయిన వెంటనే రఫ్‌ పేపర్‌ను ఇన్విజిలేటర్‌కి తిరిగి ఇచ్చేయాలి. దానిపై అభ్యర్థి హాల్‌టికెట్‌ నంబర్‌ తప్పనిసరిగా రాయాలి.
  • పరీక్షకు హాజరైన సమయంలో అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్‌, సంతకం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.

తల్లిదండ్రులు / సంరక్షకులకు మార్గదర్శకాలు…
అభ్యర్థుల తల్లిదండ్రులు లేదా వెంట వచ్చే వారు కూడా కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని త్వరలో ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటివరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారం..

పరీక్ష రాసే అభ్యర్థుల వెంబడి తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రావాలి. ఒకవేళ వచ్చినా అభ్యర్థులను పరీక్ష కేంద్రం వద్ద వదిలి వెళ్ళాలి. పరీక్షా కేంద్రం పరిసరాల్లో మాత్రం ఉండకూడదు. పరీక్షా కేంద్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటి లోపలికి రావటానికి ప్రయత్నం చేయకూడదు. మార్గదర్శకాలకు సహకరిస్తూ పరీక్ష కేంద్రం వద్ద జనాలు గుమిగూడకుండా ఉండటానికి సహకరించాలి.

డయాబెటిక్ అభ్యర్థులకు మార్గదర్శకాలు…
డయాబెటిక్ అభ్యర్థులు షుగర్‌ మాత్రలు, పండ్లు (అరటి / ఆపిల్ / నారింజ), తినదగిన వస్తువులను తీసుకువెళ్ళడానికి అనుమతిస్తారు. అయితే పరీక్ష హాల్ లోపల చాక్లెట్ / మిఠాయి / శాండ్‌విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలు అనుమతించబడవు.

Read more RELATED
Recommended to you

Latest news